డెంగీ.. కరోనా.. స్వైన్ ఫ్లూ.. ఏదన్నది అనుమానమా..?

30-09-2022 Fri 13:54 | Health
  • పరిశీలించి చూస్తే వ్యత్యాసం తెలుస్తుంది
  • అయినా కానీ, వ్యాధి నిర్ధారణ పరీక్షే ప్రామాణికం
  • వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా రక్ష
  • నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రతరం
COVID19 Or Dengue or swine flue How To Differentiate Between Symptoms
ఈ ఏడాది కరోనాకు తోడు డెంగీ, స్వైన్ ఫ్లూ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వీటిల్లో కొన్ని ఒకే మాదిరి లక్షణాలతో ఉంటుండడంతో సమస్య ఏంటన్నది తెలుసుకోలేని పరిస్థితి. వైద్య నిపుణులే వీటిల్లో ఏదన్నది నిర్ధారించగలరు. ముఖ్యంగా కరోనా, డెంగీ మధ్య లక్షణాల పరంగా కొన్ని వ్యత్యాసాలున్నా.. కరోనా, స్వైన్ ఫ్లూ ఈ రెండింటిలో అధిక శాతం లక్షణాలు ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కనుక వ్యాధి నిర్ధారణ (లేబరేటరీ పరీక్ష) పరీక్షల ద్వారానే వచ్చిన సమస్యను గుర్తించి చికిత్స చేయడం సులభం అవుతుంది. కనుక వీటిల్లో ఏ లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్యులను సంప్రదించడం ద్వారా పరిస్థితి చేయి దాటిపోకుండా చూసుకోవచ్చు.

కరోనా - స్వైన్ ఫ్లూ లో ఒకే మాదిరి లక్షణాలు
జ్వరం, చలి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, శ్వాస ఆడకపోవడం, అలసిపోవడం, గొంతులో నొప్పి, మంట, ముక్కు కారడం, కండరాలు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, చిన్న పిల్లల్లో అయితే నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి. ఈ రెండూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేవే. కరోనా అయితే సార్స్ కొవిడ్ 19 వైరస్ వల్ల వస్తే.. ఇన్ ఫ్లూయెంజా వైరస్ వల్ల స్వైన్ ఫ్లూ వస్తుంది.

వ్యత్యాసాలు 
స్వైన్ ఫ్లూ అయితే కొంచెం త్వరగా కోలుకుంటారు. లక్షణాలు నాలుగు రోజుల వరకు కనిపిస్తాయి. కరోనా అయితే కోలుకోవడానికి సమయం పట్టొచ్చు. కొన్ని కేసుల్లో రెండు వారాలు కూడా పడుతుంది. వాసన, రుచి కోల్పోవడం కరోనాలోనే కనిపిస్తుంది. స్వైన్ ఫ్లూ అయితే వైరస్ ప్రవేశించిన ఒక్క రోజులోనే లక్షణాలు కనిపిస్తాయి. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 4-5 రోజుల తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. వీటిల్లో కరోనా మరింత ప్రమాదకరం. నిర్లక్ష్యం చేస్తే స్వైన్ ఫ్లూ వైరస్ లోనూ సీరియస్ అవుతుంది. 

కరోనా -  డెంగీ
డెంగీ ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం ద్వారానే వస్తుంది. ఇది రాకుండా నివారించుకోవచ్చు. గాలి ద్వారా, కరోనా రోగుల నుంచి, వారు తాకిన వస్తువుల ద్వారా వస్తుంది. ఈ రెండింటిలోనూ ఒళ్లు నొప్పులు, చలి, జ్వరం, వాంతులు కామన్ గా కనిపిస్తాయి. ఇక్కడ కరోనాలో ఫీవర్ భారీ స్థాయిలో రాదు. డెంగీలో మాత్రం 103-105 డిగ్రీల వరకు నమోదు కావచ్చు. కరోనాలో జ్వరం వచ్చిపోయినట్టు అనిపిస్తుంది. డెంగీలో జ్వరం స్థిరంగా ఉంటుంది. 

డెంగీ దోమ కుట్టిన తర్వాత లక్షణాలు కనిపించేందుకు 3-10 రోజులు పడుతుంది. కరోనాలో వైరస్ మన శరీరంలోకి వచ్చిన 4-5 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. డెంగీలో సీరియస్ అయితే ప్లాస్మా లీకేజ్, షాక్, నీరు చేరడం, రక్తస్రావం, గుండె సమస్యలు, అవయవాల వైఫల్యం కనిపిస్తాయి. కరోనాలో పరిస్థితి తీవ్రరూపం దాలిస్తే హైపోక్సియా, ఊపిరితిత్తుల వైఫల్యం, షాక్, ఒకటికి మించిన అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది.