India: ప్రపంచ ఆవిష్కరణల సూచీలో 40వ స్థానానికి ఎగబాకిన భారత్

  • 2022 జాబితా విడుదల చేసిన డబ్ల్యూఐపీఓ
  • 2015లో 81వ స్థానంలో భారత్
  • ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్న పియూష్ గోయల్
  • భారత్ ను కొనియాడిన డబ్ల్యూఐపీఓ
India at 40th spot in Global Innovations Index

ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్ 40వ స్థానంలో నిలిచింది. 2015లో ఈ జాబితాలో 81వ స్థానంలో ఉన్న భారత్ గత ఏడేళ్లలో సాధించిన అభివృద్ధికి తాజా ర్యాంకు నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ, మునుపెన్నడూ లేనంతగా భారత్ ఆవిష్కరణల రంగంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. 

గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్-2022 జాబితాను ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ) సంస్థ విడుదల చేసింది. భారత్ అనేక ర్యాంకులు ఎగబాకి 40వ స్థానంలో నిలవడం పట్ల డబ్ల్యూఐపీఓ స్పందించింది. 

ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ రంగంలో భారత్ తక్కిన ప్రపంచానికి దిక్సూచిగా కొనసాగుతోందని కొనియాడింది. వెంచర్ క్యాపిటల్ జవాబుదారీతనం, విలువలు, స్టార్టప్ లకు ఆర్థిక ప్రోత్సాహం, సైన్స్, ఇంజినీరింగ్ రంగంలో గ్రాడ్యుయేట్ల తయారీ, కార్మిక ఉత్పాదన, దేశీయ పారిశ్రామిక వైవిధ్యం వంటి రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి సాధించిందని వివరించింది. 

కాగా, ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్వీడన్, బ్రిటన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, సింగపూర్, జర్మనీ, ఫిన్లాండ్, డెన్మార్క్, చైనా, ఫ్రాన్స్, జపాన్, హాంకాంగ్, కెనడా తదితర దేశాలు ఉన్నాయి.

More Telugu News