తల్లి ఫొటోను షేర్ చేసిన మహేశ్ బాబు.. ఊరడిస్తున్న అభిమానులు!

  • అనారోగ్యంతో మృతి చెందిన ఇందిరాదేవి
  • అంత్యక్రియలు ముగిశాక తల్లి ఫొటోను షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీలు
  • తల్లి అంటే ఎంత ఇష్టమో గతంలో మహేశ్ మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్న అభిమానులు
Tollywood Star Mahesh Babu Shares his Mother Photo

టాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిన్న మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. రాజకీయ, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. 

తల్లి అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాసేపటికే మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో తల్లి ఒకప్పటి ఫొటోను షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీలు జోడించి ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. తల్లి అంటే తనకెంత ఇష్టమో మహేశ్‌బాబు పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు. అప్పట్లో ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్‌లో మహేశ్ మాట్లాడుతూ.. తల్లి తనకు దేవుడితో సమానమని అన్నారు. తన సినిమా రిలీజ్‌కు ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతానని గుర్తు చేసుకున్నారు. 

ఆమె చేతితో కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుందన్నారు. ఆమె ఆశీస్సులు తనకు ఎప్పటికీ అవసరమని, వాటి వల్లే తనకు ఈ విజయం వచ్చిందని పేర్కొన్నారు. అలాగే, ‘భరత్ అనే నేను’ సినిమా తన తల్లి పుట్టిన రోజైన ఏప్రిల్ 20న విడుదల కావడం తనకు సంతోషంగా ఉందని, ఇది తనకెంతో ప్రత్యేకమని అప్పట్లో చెప్పారు. 

ఇందిరాదేవి మృతి వార్త తెలిసిన తర్వాత అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తూ మహేశ్‌కు తల్లిపై ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ధైర్యంగా ఉండాలంటూ అభిమానులు ఆయనను ఊరడిస్తున్నారు.

More Telugu News