Team India: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. అర్ధ సెంచరీలతో అదరగొట్టిన రాహుల్, సూర్యకుమార్

Suryakumar KL Rahul and pacers help India take lead against South Africa
  • భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిన సఫారీలు
  • 106 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే ఛేదించిన భారత్
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అర్షదీప్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (51), సూర్యకుమార్ యాదవ్ (50) అజేయ అర్ధ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ మూడు పరుగులు మాత్రమే చేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడారు. భారత బౌలర్ల పదునైన బంతులు ఎదుర్కోలేక టాపార్డర్ కుప్పకూలింది. 9 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో కేశవ్ మహారాజ్ క్రీజులో పాతుకుపోయి ఒంటరిపోరాటం చేశాడు. పార్నెల్ అతడికి కాసేపు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచే ప్రయత్నం చేశారు. దీంతో స్కోరు వంద పరుగులు దాటింది. పార్నెల్ 37 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 24 పరుగులు చేయగా, మహారాజ్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశారు. మార్కరమ్ 25 పరుగులు చేశాడు. దీంతో 106 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 

భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. అర్షదీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 2న గువాహటి వేదికగా రెండో టీ20 జరుగుతుంది.
Team India
South Africa
Thiruvananthapuram
Keshav Maharaj
Arshdeep Singh

More Telugu News