Chiranjeevi: ఒకే ఒక్క ఫోన్ కాల్ తో సల్మాన్ ను చరణ్ ఒప్పించాడు: చిరంజీవి

  • 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా సందడి 
  • ఈ సినిమా చేయడానికి కారణం చరణ్ అంటూ చెప్పిన చిరూ
  • సల్మాన్ ఒప్పుకోవడం గొప్ప విషయమంటూ వెల్లడి  
  • నయనతార ఒప్పుకోవడమే విజయానికి తొలిమెట్టు అంటూ వ్యాఖ్య 
God Father movie Pre Release Event

మలయాళంలో ఆ మధ్య మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో 'గాడ్ ఫాదర్' గా రీమేక్ చేశారు. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "నేను ఈ సినిమా చేయడానికి ప్రధానమైన కారణం చరణ్. నా ఇమేజ్ కి తగిన కథ అంటూ నన్ను ఒప్పించాడు. దర్శకుడిగా మోహన్ రాజా అయితే బాగుంటాడని తనే సూచించాడు. 

ఇక ఈ సినిమాలో సైన్యాధ్యక్షుడు వంటి పాత్రను సల్మాన్ చేస్తే బాగుంటుందని మోహన్ రాజా చాలా ఈజీగా చెప్పేశాడు. కానీ ఆ పాత్రకి సల్మాన్ ను తీసుకుని రాగలమా అనుకున్నాను. కానీ చరణ్ చేసిన ఒకే ఒక ఫోన్ కాల్ కి  ఆయన స్పందించారు. 'ఈ పాత్ర నేనే చేయాలని చిరంజీవి గారు అంటే ఓకే' అంటూ నేరుగా షూటింగుకి వచ్చేశాడు. సల్మాన్ లాంటి హీరో కథ వినకుండా షూటింగుకి వచ్చేయడం గొప్ప విషయం. అందుకు ఆయనకి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను. 

ఇక మరో కీలకమైన పాత్రకి నయనతార కావాలని మోహన్ రాజా అడిగాడు. ఆమె లేడీ సూపర్ స్టార్ .. దొరుకుతుందా అన్నాను. సార్ మీరు అనుకుంటే తీసుకురాగలరు అన్నాడు. కథ వినగానే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నయనతార ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆమె ఒప్పుకోవడమే ఈ సినిమా విజయానికి తొలిమెట్టు. ఈ సినిమాకు ఆమె ఒక నిండుదనాన్ని తీసుకుని వచ్చారు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News