తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌కు 'జ‌ల్ జీవ‌న్ మిష‌న్' అవార్డును ప్రకటించిన కేంద్రం... గాంధీ జ‌యంతి రోజున అవార్డు ప్ర‌దానం

28-09-2022 Wed 21:49 | Telangana
  • ప్ర‌తి ఇంటికి ర‌క్షిత మంచి నీటి స‌ర‌ఫ‌రాకు అవార్డు అందిస్తున్న కేంద్రం
  • ఇప్ప‌టికే ఓ ద‌ఫా అవార్డును కైవ‌సం చేసుకున్న మిష‌న్ భ‌గీర‌థ‌
  • 2022 ఏడాదికి కూడా తెలంగాణ‌నే అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం
telangana scheme mission bhagiratha bags jal jeevan mission award again
తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం కేంద్రం ప్ర‌క‌టిస్తున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్ అవార్డుకు ఎంపికైంది. ఇప్ప‌టికే ఓ ద‌ఫా ఈ అవార్డును మిష‌న్ భ‌గీర‌థ కైవ‌సం చేసుకుంది. తాజాగా ఈ ఏడాది మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఈ అవార్డుకు తెలంగాణ ప‌థ‌కం ఎంపికైంది. గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 2న ఢిల్లీలో నిర్వ‌హించ‌నున్న కార్య‌క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ అవార్డును అందుకోనుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం తెలంగాణ ప్ర‌భుత్వానికి ఓ లేఖ ద్వారా ఈ స‌మాచారాన్ని తెలిపింది.

రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటికి ర‌క్షిత మంచినీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో టీఆర్ఎస్ స‌ర్కారు మిష‌న్ భ‌గీర‌థ‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర‌త్రా ఎన్ని పథ‌కాలు ఉన్నా... సీఎం కేసీఆర్ ఈ ప‌థ‌కంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఫ‌లితంగా రాష్ట్రంలోని అన్ని ప‌ల్లెలు... చివ‌ర‌కు అట‌వీ ప్రాంతాల్లోని గిరిజ‌న గ్రామాల‌కు కూడా ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌భుత్వం మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తోంది. 

ఏటా జ‌ల్ జీవ‌న్ మిష‌న్ అవార్డును ప్ర‌కటిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం... ఈ ఏడాది కూడా అవార్డు గ్ర‌హీత ఎంపిక కోసం సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేప‌ట్టింది. ఓ స్వ‌తంత్ర సంస్థ‌తో ఆయా రాష్ట్రాల్లో ర‌క్షిత మంచి నీటి స‌ర‌ఫ‌రాపై స‌ర్వే చేయించింది. ఇందులో భాగంగా తెలంగాణ‌లో 320 గ్రామాల్లో ఆ సంస్థ స‌ర్వే చేప‌ట్టింది. ఆయా గ్రామాల్లో ఇళ్ల‌కు అందుతున్న మంచి నీటి నాణ్య‌త‌తో పాటు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించిన ఆ సంస్థ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ అవార్డుకు తెలంగాణ‌ను ఎంపిక చేసింది.