విశాఖ రైల్వే జోన్ వార్తలపై విజయసాయి మండిపాటు

28-09-2022 Wed 12:23
  • విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్రం తేల్చేసినట్టు వార్తలు
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయి మండిపాటు
  • రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని సవాల్
Vijayasai Reddy comments on Visakha railway zone
విశాఖ రైల్వే జోన్ ను ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్రం ప్రభుత్వం తేల్చేసినట్టు ఈ రోజు కొన్ని పత్రికలలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ వార్తలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ... ఇదంతా తప్పుడు ప్రచారమని అన్నారు. కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందని... రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఎల్లో మీడియా ఇలాంటి తప్పుడు వార్తలను రాస్తోందని దుయ్యబట్టారు.  

విశాఖ రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉందని విజయసాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ అంశంలో ఇంత స్పష్టత ఉన్నప్పటికీ... ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యత్నిస్తున్నారని విమర్శించారు. అవాస్తవాలను ప్రచురిస్తూ సమాజంలో వారికున్న స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు.