అందుకే పరశురామ్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదట!

28-09-2022 Wed 11:28
  • 'గీత గోవిందం'తో పేరు తెచ్చుకున్న పరశురామ్
  • బ్లాక్ బస్టర్ కి దూరంగా నిలిచిన 'సర్కారువారి పాట'
  • తదుపరి సినిమా నాగచైతన్యతో
  • స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు 
Parasuram movie with Nagachaitanya
'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ, ఆ తరువాత ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి పరశురామ్ చాలా సమయం తీసుకున్నాడు. చైతూతో ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. అదే సమయంలో మహేశ్ డేట్స్ దొరకడంతో అటువైపు వెళ్లిపోయాడు. ఈ విషయంలో నాగార్జున అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఇంతా చేస్తే 'సర్కారువారి పాట'ను బ్లాక్ బస్టర్ హిట్ గా పరశురామ్ నిలబెట్టలేకపోయాడు. ఆ తరువాత చైతూ ప్రాజెక్టును చేసుకోవచ్చని అనుకుంటే, స్క్రిప్ట్ విషయంలో ఆయన మార్పులు .. చేర్పులు చెప్పాడట. దాంతో ప్రస్తుతం పరశురామ్ అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. అందువల్లనే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని సమాచారం. 

 ఇక 'థ్యాంక్యూ' సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్న చైతూ, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' హిట్ తరువాత ఈ జోడీ మళ్లీ తెరపై చేయనున్న సందడిపై అందరిలోను ఆసక్తి ఉంది.