సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ను కోట్ల మేర మోసం చేసిన వ్యాపారి

28-09-2022 Wed 10:28
  • టాలీవుడ్  లో పలు చిత్రాల్లో నటించిన రవికిషన్
  • యూపీ నుంచి బీజేపీ తరపున గెలుపొందిన సినీ నటుడు
  • రూ. 3.25 కోట్ల మేర మోసపోయిన వైనం 
BJP MP Ravi Kishan Cheated Of 3 Crore
బీజేపీ ఎంపీ రవికిషన్ సినీనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'రేసుగుర్రం'తో పాటు టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. రాజకీయాల్లో సైతం ఆయన రాణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి ఆయన బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు. ఇదిలావుంచితే, ముంబైకి చెందిన ఓ వ్యాపారి చేతిలో రూ. 3.25 కోట్ల వరకు రవికిషన్ మోసపోయారు. 

2012లో జైన్ జితేంద్ర రమేశ్ అనే వ్యాపారికి రవికిషన్ రూ. 3.25 కోట్ల మొత్తాన్ని ఇచ్చాడు. తిరిగి తన డబ్బు ఇవ్వాలని అడిగితే... ఒక్కోటి రూ.34 లక్షల విలువైన 12 చెక్కులను ఇచ్చాడు. ఈ చెక్కుల్లో ఒకదాన్ని గత ఏడాది డిసెంబర్ లో రవికిషన్ డిపాజిట్ చేశాడు. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో, డబ్బు చెల్లించమని జితేంద్రను ఒత్తిడి చేస్తున్నప్పటికీ... ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో జితేంద్రపై రవికిషన్ పీఆర్వో దూబే నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జితేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.