ECB: భారత్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ కు ఆతిథ్యమిచ్చేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆసక్తి

ECB shows keen interest to host test series between Team India and Pakistan
  • 2007లో చివరిసారిగా టెస్టు ఆడిన దాయాదులు
  • రాజకీయ కారణాలతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని వైనం
  • పాక్ క్రికెట్ పెద్దల ముందు ప్రతిపాదన ఉంచిన ఈసీబీ
దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు సిరీస్ కు ఆతిథ్యమిచ్చేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు ఈసీబీ పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు ప్రతిపాదన చేసింది. 

2007 డిసెంబరులో భారత్, పాక్ జట్ల మధ్య చివరిసారిగా టెస్టు మ్యాచ్ జరిగింది. రాజకీయ కారణాలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లకు అవకాశమే లేకుండా పోయింది. 2013 తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. 

ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 జట్టు పాకిస్థాన్ లో పర్యటిస్తోంది. ఆ జట్టు వెంట ఈసీబీ డిప్యూటీ చైర్మన్ మార్టిన్ డార్లో కూడా ఉన్నారు. ఈ సందర్భంగా, భారత్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ కు తటస్థ వేదికగా ఇంగ్లండ్ నిలుస్తుందని మార్టిన్ డార్లో... పీసీబీ చీఫ్ రమీజ్ రాజాకు ప్రతిపాదించారు. దీనిపై రమీజ్ రాజా ఏంచెప్పారన్నది తెలియరాలేదు.

అయితే, ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్ మొయిన్ అలీ ఈ ప్రతిపాదనను స్వాగతించాడు. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ వేదికగా నిలిస్తే అది అద్భుతమే అవుతుందని పేర్కొన్నాడు. రెండు మేటి జట్లు ఇలా కేవలం వరల్డ్ కప్ లు, ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతుండడం, పరస్పరం సిరీస్ లలో ఆడకపోవడం సిగ్గుపడాల్సిన విషయం అని మొయిన్ అభిప్రాయపడ్డాడు.

కాగా, ఈ ప్రతిపాదన పట్ల బీసీసీఐ వర్గాలు స్పందించాయి. భారత్, పాక్ జట్ల మధ్య ద్యైపాక్షిక సిరీస్ జరగబోదని, అతి తటస్థ వేదికపై అయినా సరే వీలుకాదని స్పష్టం చేశాయి.
ECB
Team India
Pakistan
Test Series

More Telugu News