మోదీ వచ్చాకే ఆ రంగంలో సమూల మార్పులు: అమిత్​ షా

27-09-2022 Tue 21:44
  • గత ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల పేరుతో దోచుకున్నాయన్న కేంద్ర హోం మంత్రి
  • తాము ఆయుష్మాన్ భారత్ తో 60 కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తున్నట్టు వెల్లడి
  • దేశంలో వైద్య కళాశాలల సంఖ్యను కూడా గణనీయంగా పెంచినట్టు వివరణ
Modi improving medical infrastructure says amit shah
దేశంలో ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చాకే వైద్యారోగ్య రంగంలో సమూల మార్పులు వచ్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో భారీగా ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తోందని చెప్పారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోందని తెలిపారు.

అప్పట్లో ఆసుపత్రుల్లో వైద్యులూ లేరు
వైద్య సదుపాయాల కల్పన పేరుతో గత పాలకులు డబ్బులు దోచుకోవడంలోనే దృష్టిపెట్టారని అమిత్ షా ఆరోపించారు. ఆసుపత్రుల్లో వైద్యులు కూడా లేకపోతే మౌలిక సదుపాయాల కల్పనకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాతే వైద్య రంగంలో మార్పులు వచ్చాయన్నారు. 2014 సమయంలో దేశంలో మొత్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉంటే.. తమ హయాంలో 600కు పెరిగాయని చెప్పారు. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 51,348 నుంచి 89,875కి పెరిగిందని గుర్తు చేశారు. కొత్తగా పది ఎయిమ్స్‌ అందుబాటులోకి వచ్చాయని.. మరో 22 రానున్నాయని వివరించారు.

భారీగా నిధులు ఇచ్చాం
2014 తర్వాత వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.64 వేల కోట్లు కేటాయించామని అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 35 వేల బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాల కోసం ప్రత్యేకంగా మరో రూ.1,600 కోట్లను మంజూరు చేశామని వివరించారు.