ఏపీ మంత్రుల మానసిక ఆరోగ్యంపై సందేహాలు కలుగుతున్నాయి: విష్ణువర్ధన్ రెడ్డి

27-09-2022 Tue 19:55
  • ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడంలేదన్న విష్ణు 
  • వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని విమర్శ 
  • మానసిక ఆసుపత్రులు కట్టాలని ఎద్దేవా
BJP leader Vishnu Vardhan Reddy doubts AP Ministers mental health
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ మంత్రులపై ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు బజారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, వారి భాష అసభ్యకరంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది అభ్యంతరకరమని అన్నారు. 

ఇలాంటివాళ్లను మంత్రులుగా చేసిన జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఊళ్లమీదికి వదిలినట్టుందని విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తామని డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడడం సిగ్గుచేటని, అవసరమైతే ఓటర్ల కాళ్లు పట్టుకుంటామని మరో మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారని విమర్శించారు. 

తాము తలుచుకంటే అమరావతి రైతుల పాదయాత్రను ఆపేయగలమని బొత్స అంటున్నారని, రోజా, అంబటి రాంబాబు ఏంమాట్లాడతారో వారికే తెలియదని అన్నారు. 

చూస్తుంటే, మంత్రుల మానసిక ఆరోగ్యంపై సందేహాలు కలుగుతున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. మానసిక వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్న మంత్రుల కోసం మానసిక ఆసుపత్రులను నిర్మించాల్సి వచ్చేట్టుందని ఎద్దేవా చేశారు.