అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాలు ప్రారంభం: మంత్రి అమ‌ర్‌నాథ్‌

27-09-2022 Tue 19:50
  • తొలుత 1,000 మందితో కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం
  • క్ర‌మంగా ఉద్యోగుల సంఖ్య‌ను 3 వేల‌కు పెంచ‌నున్న సంస్థ‌
  • సంస్థ కార్య‌క‌లాపాల ప్రారంభంపై మంత్రి అమ‌ర్‌నాథ్ ప్ర‌క‌ట‌న‌
infosys starts its activities at vizag on october 1
భార‌తీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ ఏపీలో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదివ‌ర‌కే సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో పాటుగా అందుకు త‌గ్గ ఏర్పాట్ల‌ను కూడా చ‌క‌చ‌కా పూర్తి చేసింది. ఈ ఏర్పాట్ల‌న్నీ ఇప్ప‌టికే పూర్తి కాగా... మ‌రో 4 రోజుల్లో ఏపీలో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

అక్టోబ‌ర్ 1 నుంచి విశాఖ‌లో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాలు ప్రారంభం కానున్న‌ట్లు అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. విశాఖ‌లోని త‌న కార్యాల‌యంలో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నుంద‌ని ఆయ‌న తెలిపారు. తొలి ద‌శ‌లో 1,000 మంది ఉద్యోగుల‌తో కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నున్న ఇన్ఫోసిస్‌... క్ర‌మంగా ఉద్యోగుల సంఖ్య‌ను 3 వేల‌కు పెంచ‌నుంద‌ని ఆయ‌న తెలిపారు. ఫ‌లితంగా ఏపీలో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాలు మ‌రింత‌గా విస్త‌రించ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.