టాలీవుడ్ హీరోకు చెందిన కంపెనీ నుంచే నా కుటుంబంపై ట్రోలింగ్: మంచు విష్ణు

27-09-2022 Tue 19:31
  • సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన మంచు విష్ణు
  • ఇక‌పై సహించేది లేద‌న్న మా అధ్య‌క్షుడు
  • త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా ప‌నిగ‌ట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం
  • త్వ‌ర‌లోనే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని వెల్ల‌డి
tollywood hero manchu vishnu fires over trolling on his family
సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పైనా జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై టాలీవుడ్ యువ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. త‌న తాజా చిత్రం జిన్నా మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్స్‌తో మంచు విష్ణు మంగ‌ళ‌వారం మాట్లాడారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై, త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో త‌న‌ను, త‌న కుటుంబాన్ని టార్గెట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌ద‌రు హీరో జూబ్లిహిల్స్‌లోని తన ఐటీ కంపెనీలో త‌న కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ని విష్ణు ఆరోపించారు. 

ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే తాను పూర్తి వివ‌రాలు సేక‌రించాన‌ని విష్ణు తెలిపారు. ఆ హీరో న‌డుపుతున్న ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించాన‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మ‌గ్ర ఆధారాల‌తో ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. మా ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న‌పై చాలా మంది ట్రోల్ చేశార‌న్న విష్ణు... నాడు వాటిపై అంత‌గా దృష్టి సారించ‌లేద‌ని, అయితే ఇప్పుడు మాత్రం ట్రోలింగ్‌ను స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు.