Shahid Afridi: అలాంటి ఆటగాడు మాకు ఒక్కడు కూడా లేడు: టీమిండియా స్టార్ పై అఫ్రిది ప్రశంసలు

Afirdi appreciates Team India all rounder Hardik Pandya
  • ఇటీవల విశేషంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా
  • ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఆడే సత్తా పాండ్యా సొంతం
  • పాండ్యాపై విమర్శకుల ప్రశంసలు
  • పాండ్యాను ఆకాశానికెత్తేసిన అఫ్రిది
ఇప్పటికిప్పుడు టీ20 క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని అడిగితే టక్కున హార్దిక్ పాండ్యా పేరు చెప్పేస్తారు. ఇటీవల జరిగిన మ్యాచ్ ల్లో చివరి ఓవర్లలో సైతం ఎంతో కూల్ గా ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన ఘనత పాండ్యాకు దక్కింది. గత కొంతకాలంగా ఫామ్ లో ఉన్న పాండ్యాపై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

తాజాగా, పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిదీ కూడా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. అంతేకాదు, పాండ్యాను ఆకాశానికెత్తేశాడు. హార్దిక్ పాండ్యాకు సరితూగే ఆటగాడు ఒక్కరు కూడా పాకిస్థాన్ జట్టులో లేరని అన్నాడు.

పాక్ జట్టుకు ఆసిఫ్ అలీ, ఖుష్ దిల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరూ హార్దిక్ పాండ్యా ఆడినంత నిలకడగా ఆడలేకపోతున్నారని పేర్కొన్నాడు. 

"మాకు కూడా హార్దిక్ పాండ్యా వంటి ఫినిషర్ కావాలి. బ్యాటింగ్ లోనూ రాణిస్తూ, బౌలింగ్ లోనూ కీలకంగా ఉన్న పాండ్యా ఎంతో నమ్మకస్తుడైన ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకున్నాడు. పాకిస్థాన్ జట్టులోని ఆసిఫ్ అలీ, ఖుష్ దిల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లలో కనీసం ఇద్దరైనా నిలకడగా ఆడితే జట్టుకు ఉపయోగం. షాదాబ్ ఓవర్లు విసిరే సమయం ఎంతో కీలకం. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో రాణించాలంటే మాత్రం పాక్ తన లోపాలను పూడ్చుకోవాల్సిందే" అని అఫ్రిదీ అభిప్రాయపడ్డాడు.
Shahid Afridi
Hardik Pandya
Pakistan
Team India

More Telugu News