తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్

27-09-2022 Tue 18:53
  • తిరుమల పర్యటనకు విచ్చేసిన సీఎం జగన్
  • రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం
  • తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయం సందర్శన
  • అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభించనున్న సీఎం
CM Jagan offers special prayers at Gangamma Temple in Tirupa
ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు విచ్చేశారు. కొద్దిసేపటి కిందట రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, తొలుత తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. సీఎం రాకతో గంగమ్మ ఆలయం వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఆలయ వర్గాలు సీఎం జగన్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. 

అనంతరం సీఎం జగన్ తన పర్యటన షెడ్యూల్ లో భాగంగా, అలిపిరి చేరుకుని విద్యుత్ బస్సులను ప్రారంభించారు. అందంగా ముస్తాబు చేసిన ఎలక్ట్రిక్ బస్సు ముందు నిలుచుకుని పచ్చజెండా ఊపారు. ఈ విడతలో మొత్తం 10 ఎలక్ట్రిక్ బస్సులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుమల కొండపైకి చేరుకుని ముందుగా బేడీ ఆంజనేయస్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆపై, తిరుమల వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 

కాగా, రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు.