Daggubati Purandeswari: 'ఎన్టీ రామారావు చేతకానివాడు' అంటూ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలు... మంత్రిపై ఏం చర్య తీసుకుంటారన్న పురందేశ్వరి!

  • హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు
  • దేశంలోనే ఎన్టీఆర్ అంత చేతకానివాడు లేడన్న మంత్రి రాజా
  • రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడని వెల్లడి
  • సీఎం జగన్ ను ప్రశ్నించిన పురందేశ్వరి
Purandeswari asks CM Jagan wthat action will be taken on minister Dadisetty Raja

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు కలిగిస్తోంది. మంత్రి దాడిశెట్టి రాజా ఈ అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంతకీ మంత్రి దాడిశెట్టి రాజా ఏమన్నారంటే... "స్వర్గీయ ఎన్టీఆర్ ను, స్వర్గీయ వైఎస్సార్ ను పోల్చుతూ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే... అసలు వైఎస్సార్ కు ఎన్టీఆర్ కు పోలికే లేదు. నన్నడిగితే ఎన్టీఆర్ అంత చేతకానివాడు భారతదేశం మొత్తమ్మీద ఇంకెవరూ లేరు. ఎందుకంటే, ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్రమంతా తన గుప్పిట్లో ఉన్న సమయంలో రెండుసార్లు వెన్నుపోట్లు పొడిపించుకున్నాడు. ఒకసారి నాదెండ్ల భాస్కర్ రావుతో, మరోసారి అల్లుడు చంద్రబాబుతో వెన్నుపోటు పొడిపించుకున్నాడు. అందుకే అతడిని చేతకానివాడు అంటాను" అంటూ దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. 

దీనిపై పురందేశ్వరి తీవ్రస్థాయిలో స్పందించారు. "ఎన్టీ రామారావు అంటే అమితమైన గౌరవం ఉందని చెప్పే ముఖ్యమంత్రి జగన్ గారూ... ఈ మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ మంత్రిపై చర్యలు తీసుకోకపోతే ఇది  మీ అభిప్రాయం కూడా అని భావించాలా? ఎందుకంటే ఈ కామెంట్ చేసినవారు మీ క్యాబినెట్ మంత్రి" అని వివరించారు. ఈ మేరకు ఆమె మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.

More Telugu News