'కాంచన' చూసిన రజనీ సార్ ఒక్కటే ఒక మాటన్నారు: శరత్ కుమార్

27-09-2022 Tue 17:12
  • తాజా ఇంటర్వ్యూలో 'కాంచన' గురించి ప్రస్తావించిన శరత్ కుమార్
  • ట్రాన్స్ జెండర్ పాత్రకి లారెన్స్ ఒప్పించాడంటూ చెప్పిన స్టార్ 
  • ఆ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందంటూ వెల్లడి 
  • రజనీ ప్రత్యేకంగా ఆ సినిమాను చూశారంటూ హర్షం
Sharath Kumar Interview
శరత్ కుమార్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించిన సినిమాలలో 'కాంచన' ఒకటి. ఆ సినిమాను గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'కాంచన' సినిమా కోసం లారెన్స్ నన్ను కలిశాడు. ఆ సినిమా కథ మొత్తం చెప్పిన తరువాత, అందులోని ట్రాన్స్ జెండర్ పాత్రను నేను వేయాలని అన్నాడు. దాంతో నేను ఆలోచనలో పడ్డాను. 

నా పర్సనాలిటీకి ట్రాన్స్ జెండర్ పాత్ర సెట్ అవుతుందా? ఆడియన్స్ ఆ పాత్రలో నన్ను అంగీకరిస్తారా? అనే ఆలోచనలో పడ్డాను. అదే మాటను నేను లారెన్స్ తో అన్నాను. ఈ పాత్ర ద్వారా ఒక మెస్సేజ్ వెళుతుంది .. మీరు చేస్తేనే బాగుంటుంది అని లారెన్స్ అన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ పాత్రకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. 

ఆ తరువాత ఒక సందర్భంలో రజనీ సార్ ను కలిశాను. అప్పుడు ఆయన 'కాంచన' గురించి ప్రస్తావించారు. "అందరూ ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారయ్యా. అంతగా ఈ సినిమాలో ఏవుందా అని చూశాను. అప్పటివరకూ ఒకలా సాగుతూ వచ్చిన సినిమా, నీ ఎంట్రీ నుంచి అదిరిపోయింది. అక్కడి నుంచి సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది" అని అన్నారంటూ చెప్పుకొచ్చారు.