బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో ఇందిరా గాంధీ!.. పాత ఫొటోతో బ‌తుక‌మ్మ గ్రీటింగ్స్ చెప్పిన ప్రియాంకా గాంధీ!

27-09-2022 Tue 17:09
  • తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బ‌తుక‌మ్మ గ్రీటింగ్స్ చెప్పిన ప్రియాంకా గాంధీ
  • 1978లో బ‌తుకమ్మ ఉత్స‌వాల్లో పాల్గొన్న‌ ఇందిరా గాంధీ
  • నాటి ఘ‌ట‌న మ‌ధుర స్మృతిగా నిలిచింద‌న్న ప్రియాంక
priyanka gandhi shares a old photo which shows indira gandhi participated in batukamma fest
తెలంగాణ‌లో వేడుక‌గా జ‌రిగే బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ...ప్ర‌త్యేకించి తెలంగాణ ఆడ‌ప‌డు‌చుల‌కు బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రియాంకా... త‌న నాన‌మ్మ, మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాలుపంచుకున్న పాత ఫొటోను షేర్ చేశారు. 

1978లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఇందిరా గాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా పూల‌తో అలంక‌రించిన బ‌తుక‌మ్మ‌ను త‌న చేతుల్లో ప‌ట్టుకుని ఉన్న ఇందిరా గాంధీ ఫొటోనే ప్రియాంకా గాంధీ షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో త‌న‌ నానమ్మ ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతిగా నిలిచింద‌ని ప్రియాంకా పేర్కొన్నారు. 1980లో ఇందిర మెద‌క్ పార్ల‌మెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.