మునుగోడు అసెంబ్లీ టికెట్ అడగడమే నేను చేసిన తప్పా?: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

27-09-2022 Tue 17:00 | Telangana
  • కొందరు నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారన్న నర్సయ్య గౌడ్
  • పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు అందడం లేదని విమర్శ
  • తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని వ్యాఖ్య
Boora Narsaiah Goud comments on Jagadish Reddy
కొందరు టీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఆహ్వానాలు అందడం లేదని... తనను ఆహ్వానించనంత మాత్రాన తన స్థాయి పడిపోదని చెప్పారు. తనను అవమానిస్తే మునుగోడు ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. 

కేసీఆర్ మాత్రమే నాయకుడని, ఆయన ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వడం లేదని నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. మునుగోడు అసెంబ్లీ టికెట్ అడగడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. 

మరోవైపు, నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయనకు అందజేస్తామని తెలిపారు. పార్టీకి చెందిన సమాచారం మాజీ ఎంపీకి ఎందుకు అందడం లేదో కనుక్కుంటామని చెప్పారు. ఇంకోవైపు... మునుగోడు ఉపఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు జగదీశ్ రెడ్డి మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.