హైదరాబాదులో మళ్లీ వర్షం... అత్యవసరమైతేనే బయటికి రావాలన్న జీహెచ్ఎంసీ

27-09-2022 Tue 16:49
  • నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
  • రోడ్లపై భారీగా నీరు
  • కిలోమీటర్ల కొద్దీ నిలిచిన ట్రాఫిక్
Heavy Rain lashes Hyderabad
హైదరాబాదుపై వరుణుడు మరోసారి ప్రభావం చూపించాడు. నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. అబిడ్స్, సుల్తాన్ బజార్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, బేగంపేట, చిలకలగూడ, ఆల్వాల్, మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, హైదర్ గూడ, ప్యాట్నీ, హిమాయత్ నగర్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. నిన్నటిలాగానే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పందించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది. డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది.