Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల‌తో ముగిసిన కేంద్ర హోం శాఖ స‌మావేశం... ఏ ఒక్క నిర్ణ‌యం లేకుండానే ముగిసిన భేటీ

  • కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో జ‌రిగిన భేటీ
  • ఇరు రాష్ట్రాల సీఎస్‌లు స‌మీర్ శ‌ర్మ‌, సోమేశ్ కుమార్ హాజ‌రు
  • ఏపీ ప్ర‌తిపాద‌న‌ల్లో ఏ ఒక్క దానినీ అంగీక‌రించని తెలంగాణ‌
  • విద్యుత్ బ‌కాయిల అంశం చ‌ర్చ‌కే రాని వైనం
  • ఏ ఒక్క పరిష్కారం లేకుండానే ముగిసిన భేటీ
union home ministry meeting with telugu states concludes

ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు, అపరిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల‌తో కేంద్ర హోం శాఖ నిర్వ‌హించిన కీల‌క స‌మావేశం మంగ‌ళ‌వారం ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి ఏపీ, తెలంగాణ‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు స‌మీర్ శ‌ర్మ‌, సోమేశ్ కుమార్‌ల నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారుల బృందాలు హాజ‌ర‌య్యాయి. కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్‌ భ‌ల్లా నేతృత్వంలో జ‌రిగిన ఈ భేటీకి కేంద్ర ప్ర‌భుత్వంలోని ప‌లు శాఖ‌ల అధికారులు కూడా హాజ‌ర‌య్యారు.

మొత్తం 14 అంశాల‌పై చ‌ర్చ జ‌రిగేలా అజెండా రూపొందగా.. భేటీలో కొన్ని కీల‌క అంశాలు అస‌లు చ‌ర్చ‌కే రాలేద‌ని స‌మాచారం. ఇరు రాష్ట్రాల మ‌ధ్య త‌ర‌చూ వివాదం రేపుతున్న విద్యుత్ బ‌కాయిల చెల్లింపుల అంశం ఈ భేటీలో చ‌ర్చ‌కు రాలేదు. ఇక ఈ భేటీలో రెండు రాష్ట్రాల మ‌ధ్య న‌లుగుతున్న ప‌లు స‌మ‌స్య‌ల్లో ఏ ఒక్క అంశానికి కూడా ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఆయా అంశాల‌పై ఏపీ ప్ర‌తిపాద‌న‌ల‌ను తెలంగాణ అంగీక‌రించ‌లేదు. 

అంతేకాకుండా ఎప్ప‌టిమాదిరిగానే ఈ స‌మావేశంలోనూ ఇరు రాష్ట్రాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డి... రెండో వైపు వాద‌న‌ల‌ను వినేందుకు ఆస‌క్తి చూపించ‌లేద‌ని స‌మాచారం. దీంతో స‌మావేశం ముగిసిన‌ట్లుగా కేంద్ర హోం శాఖ ప్ర‌క‌టించింది. అయితే మ‌రోమారు భేటీ కావాలా? వ‌ద్దా? అన్న అంశంపైనా స్ప‌ష్ట‌త లేకుండానే ఈ భేటీ ముగిసింది.

ఇదిలా ఉంటే... రాజ‌ధాని కూడా లేకుండా కొత్త ప్ర‌స్థానం ప్రారంభించిన ఏపీ, రాజ‌ధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. ప్ర‌స్తుతానికి రూ.1,000 కోట్లు అత్య‌వ‌స‌రంగా విడుద‌ల చేయాల‌ని కోరింది. అయితే రాజ‌ధాని నిర్మాణం కోసం ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రూ.1,500 కోట్లకు లెక్క‌లు చెప్పాల‌ని కేంద్రం కోరింది. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం రూ.29 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని ఏపీ ప్ర‌స్తావించింది. అయితే ఈ విష‌యంపై షీలా బేడీ క‌మిటీ నివేదిక‌ను ప‌రిశీలించి... ఆ కమిటీ సిఫార‌సుల‌పై న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేంద్రం తెలిపింది.

More Telugu News