NASA: నాసా మరో అద్భుత విజయం.. గ్రహశకలాల నుంచి భూమిని రక్షించే ప్రయోగం విజయవంతం!

  • పది నెలలుగా అంతరిక్షంలో తిరుగుతున్న ‘డార్ట్’
  • గ్రహశకలం డైమోర్ఫోస్‌పై కూలి దాని దిశ మార్చిన వైనం
  • 530 అడుగుల వెడల్పు ఉన్న డైమోర్ఫోస్‌ 
  • ప్రపంచంలోనే ఇది తొలి ప్రయోగం
 NASAs DART Mission Hits Asteroid in First Ever Planetary Defense Test

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుత విజయం సాధించింది. భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ) గ్రహశకలమైన డైమోర్ఫోస్‌ను తాకింది. గ్రహశకల ప్రమాదాల నుంచి భూమిని రక్షించేందుకు ఉద్దేశించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మిషన్ ఇది. పది నెలలుగా అంతరిక్షంలో తిరుగుతున్న ‘డార్ట్’ మంగళవారం ఈ విజయం సాధించినట్టు మేరీల్యాండ్‌లోని లారెల్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) మిషన్ కంట్రోల్ ప్రకటించింది. 

530 అడుగుల (160 మీటర్లు) వెడల్పు ఉన్న డైమోర్ఫోస్‌ గమనాన్ని మార్చేందుకు డార్ట్ ఉద్దేశపూర్వకంగానే దానిని ఢీకొట్టింది. భూమికి 7 మిలియన్ మైళ్ల (11 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఏపీఎల్ తెలిపింది. డైమోర్ఫోస్ గ్రహశకలం డిడిమోస్ అనే 2,560 అడుగుల (780 మీటర్ల) భారీ గ్రహశకలం చుట్టూ తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, దీనివల్ల భూ గ్రహానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. 

ఈ వన్ వే ట్రిప్ ద్వారా వ్యోమనౌకను నాసా విజయవంతంగా నేవిగేట్ చేయగలదని నిరూపితమైంది. ఉద్దేశపూర్వకంగా గ్రహశకలాన్ని ఢీకొట్టే ఈ టెక్నిక్‌ను ‘కైనటిక్’ ఇంపాక్ట్ అని పిలుస్తారు. డార్ట్ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా భవిష్యత్తులో భూమి వైపుగా దూసుకొచ్చి భారీ విధ్వంసం సృష్టించగల గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించే అవకాశం చిక్కింది.

More Telugu News