ORR: ట్రాఫిక్ త‌గ్గితే ఇదీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరిగితే ఇదీ పెరుగుతుంది... ఔట‌ర్‌పై వెబ్ కంట్రోల్డ్‌ లైటింగ్ సిస్ట‌మ్‌!

  • ఓఆర్ఆర్‌పై స‌రికొత్త లైటింగ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు
  • వెబ్ ఆధారితంగా ప‌నిచేయ‌నున్న కొత్త వ్య‌వ‌స్థ‌
  • ఓఆర్ఆర్ మీద మొత్తంగా 9706 విద్యుత్ స్తంభాల ఏర్పాటు
  • వాటిపై 18,220 ఎల్ఈడీ బ‌ల్బుల అమ‌రిక  
web controlled lighting system is all set to start on orr

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం చుట్టూరా ప‌రుచుకున్న ఔట‌ర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్‌) ఎన్నెన్నో నూతన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు మ‌నం రోడ్ల‌పై నిర్దేశిత వేగాన్ని దాటి దూసుకెళుతూ ఉంటే... ఏ పోలీసు మ‌న‌ల్ని గుర్తించాల్సిన అవ‌స‌రం లేకుండానే... స్పీడ్ లిమిట్ దాటారంటూ ఓ నోటీసు మ‌న‌కు వ‌స్తుంది. ఇందుకు ఆయా రోడ్ల‌పై ఏర్పాటు చేసిన స్పీడ్ గ‌న్ లే కార‌ణం. ఈ స్పీడ్ గ‌న్‌ల‌ను కూడా తొలుత ఓఆర్ఆర్ మీదే ఏర్పాటు చేశారు.

తాజాగా ప్ర‌యాణికుల‌కు అత్యంత సౌక‌ర్య‌వంతంగానే కాకుండా విద్యుత్‌ను కూడా ఆదా చేసి ప్ర‌భుత్వానికి ఆర్థికంగా కొంత‌లో కొంతైనా ఊర‌ట క‌ల్పించేలా ఓ స‌రికొత్త విధానం ఓఆర్ఆర్‌పై అందుబాటులోకి వ‌స్తోంది. అదే వెబ్ కంట్రోల్డ్ లైటింగ్ సిస్ట‌మ్‌. ఆన్‌లైన్ వేదిక‌గా ఎక్క‌డో కంట్రోల్ రూమ్‌లో కూర్చుని ఈ లైటింగ్ సిస్ట‌మ్‌ను మ‌నం నియంత్రివ‌చ్చు. అంతేకాకుండా నిర్దేశిత ప్ర‌మాణాల‌ను ముందుగానే ఫీడ్ చేస్తే... దానికి అనుగుణంగానే ఈ లైటింగ్ వ్య‌వ‌స్థ ప‌నిచేసుకుంటూ వెళుతుంది. 

ఈ లైటింగ్ సిస్ట‌మ్ త‌న ప‌రిధిలో ట్రాఫిక్ మోతాదును బ‌ట్టి త‌న లైటింగ్‌ను మార్చుకుంటుంది. ట్రాఫిక్ భారీగా ఉంటే... ఈ లైటింగ్ వ్య‌వ‌స్థ దేదీప్య‌మానంగా వెలిగిపోతూ వాహ‌న‌దారుల‌కు ఇబ్బంది లేకుండా చేస్తుంది. అదే ట్రాఫిక్ ప‌ల‌చ‌బ‌డిపోతే... అందుకనుగుణంగానే లైటింగ్ కూడా దానిక‌దే త‌గ్గిపోతుంది. 

ఫ‌లితంగా అన‌వ‌స‌ర‌ స‌మ‌యాల్లో వెలుగులు విర‌జిమ్మి ప్ర‌భుత్వ ఖ‌జానాకు గండి కొట్టే య‌త్నానికి ఫుల్ స్టాప్ పెడుతోంది. ఓఆర్ఆర్ మీద ఈ కొత్త లైటింగ్ సిస్ట‌మ్ గురించి తెలంగాణ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక ప్రధాన కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఓఆర్ఆర్ మీద ఈ స‌రికొత్త లైటింగ్ వ్య‌వ‌స్థ‌లో మొత్తంగా 9706 విద్యుత్ స్తంభాల‌పై 18,220 ఎల్ఈడీ లైట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

More Telugu News