శివుడిపై భక్తితో పదేళ్ల కిందట చేయి పైకెత్తి ఇప్పటికీ దించలేదు.. సాధువు వైరల్​ వీడియో ఇదిగో

26-09-2022 Mon 17:05
  • రాత్రి, పగలు నిరంతరం చేయి పైకెత్తే ఉంచే సాధువు
  • సాధ్యమైనంత కాలం అలానే ఉంటానని చెబుతున్న వైనం
  • చేతికి రక్త ప్రసరణ తగ్గిపోయి, నొప్పి వుండదంటున్న వైద్య నిపుణులు 
Monk kept his right arm raised
ఆయన ఓ సాధువు.. శివుడిపై అనంతమైన భక్తి.. ఆ భక్తితో దేవుడికి నివాళిగా తన చేయిని పైకి ఎత్తాడు. మరి ఎత్తిన చేయి ఎవరైనా కాసేపటికి కిందికి దింపేస్తారు. మహా అయితే ఐదు పది నిమిషాలు, ఇంకా అయితే ఓ అరగంట పట్టుకోగలరు. కానీ ఈ సాధువు మాత్రం పదేళ్లుగా తాను ఎత్తిన చేయిని దించలేదు. రాత్రిపగలు చేతిని అలాగే ఉంచేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి సాధువుతో మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది.

అలాగే ఉంచేస్తానంటూ..
  • తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని ఈ సాధువు పేర్కొన్నారు. పదేళ్లకుపైగా తాను చేతిని పైకి ఎత్తే ఉంచానని అలా ఎత్తే ఉంచేస్తానని తెలిపారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని వివరించారు. ఇంతకుముందు కూడా అమర్ భర్తీ అనే 70 ఏళ్ల సాధువు ఏకంగా 50 ఏళ్లకుపైగా తన చేతిని ఎత్తి ఉంచిన వార్తలు వచ్చాయి.
  • అమర్‌ భర్తీ కూడా తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలన్న ఉద్దేశంతో సాధువుగా మారి, శివుడి పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచేశారు. మొదట రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదని, తర్వాత తగ్గిపోయిందని ఆయన చెప్పేవారు.
  • అయితే ఇలా చేయి ఎత్తి పట్టుకోవడం వల్ల క్రమంగా ఆ చేతికి రక్త ప్రసరణ నిలిచిపోయి గట్టిపడిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నొప్పి ఉండదని అంటున్నారు.