డబ్బులు ఇవ్వకుండా శ్రీహరిని మోసం చేసినవారే ఎక్కువ: శాంతి శ్రీహరి

26-09-2022 Mon 16:44
  • శ్రీహరిని ఇప్పటికీ మరిచిపోని ప్రేక్షకులు 
  • ఆయన తీరును ప్రస్తావించిన శాంతి 
  • శ్రీహరికి గల సినిమా ప్రేమ గురించి ప్రస్తావన 
  • చాలామంది డబ్బులు ఎగ్గొట్టారంటూ ఆవేదన
Shanthi Srihari Interview
తెలుగు తెరపై విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. హీరోగా శ్రీహరి తన సత్తాను చాటుకున్నారు. కెరియర్ మంచి జోరుగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన అనారోగ్య కారణాల వలన చనిపోయారు. ఆ తరువాత శాంతి శ్రీహరి తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి బయటపడిన ఆమె, పిల్లల కెరియర్ ను ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. 

తాజా ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి శాంతి మాట్లాడుతూ .. " మా బావకు సినిమాలంటే పిచ్చి. అందువలన ఎవరు ఎంత ఇస్తామని చెప్పినా వెంటనే ఒప్పేసుకునేవారు. చాలామంది సినిమా తరువాత ఇస్తామని చెప్పేవారు. సినిమా పూర్తయిన తరువాత ఇవ్వకుండా ఎగ్గొట్టేవారు. అలా ఎగ్గొట్టినవారే ఎక్కువమంది ఉన్నారు. చిరంజీవిగారి సంస్థ ... మరొక రెండు మూడు సంస్థలు మాత్రమే డబ్బులు కరెక్టుగా ఇచ్చేవారు. 

ముందుగా చెప్పినట్టుగా తనకి రావలసిన డబ్బులు ఇవ్వవలసిందే అని బావ పట్టుబట్టి ఉంటే మేము ఇంకో పది ఇళ్లు కొనుక్కుని ఉండేవాళ్లం. బావ మంచితనం .. సినిమాల పట్ల ఆయనికి గల ప్రేమను ఆసరాగా చేసుకుని చాలామంది ఎగ్గొట్టారు. ఇక ఆయన చనిపోయిన తరువాత కూడా మమ్మల్ని ఎవరూ పెద్దగా పలకరించినవారు లేరు .. పట్టించుకున్నవారు లేరు" అంటూ చెప్పుకొచ్చారు.