Supreme Court: ఒక్క కేసుకు ఎంత‌మంది లాయ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తారు?... ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన సుప్రీంకోర్టు!

  • ఏపీలో ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టంపై ఇదివ‌ర‌కే ఎన్జీటీ తీర్పు
  • రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.120 కోట్ల జ‌రిమానా విధించిన వైనం
  • ఎన్జీటీ తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ పిటిష‌న్‌
  • ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టానికి ప్ర‌భుత్వం ఎందుకు బాధ్య‌త వ‌హించ‌ద‌న్న కోర్టు
  • లాయ‌ర్లకు ఫీజుల చెల్లింపులోని శ్ర‌ద్ధ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై క‌నిపించ‌డం లేద‌ని ఆక్షేప‌ణ‌
supreme court asks ap government how many lawyers are engaged for one case

ప్రాజెక్టుల వల్ల ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రుగుతున్న న‌ష్టంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా సోమ‌వారం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఏపీలో ప‌లు ప్రాజెక్టుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి అపార న‌ష్టం జ‌రిగింద‌ని ఆరోపిస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన ఎన్జీటీ ప్రిన్సిప‌ల్ బెంచ్‌.. ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జ‌రిమానా విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ తీర్పును నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌పై జ‌స్టిస్ ర‌స్తోగి, జ‌స్టిస్ ర‌వికుమార్‌లతో కూడిన‌ బెంచ్ సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. 

ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని ప్ర‌భుత్వం ఎందుకు భ‌రించ‌దని కోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఈ ఒక్క కేసు విచార‌ణ‌కు ఎంత‌మంది సీనియ‌ర్ లాయ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. ఈ కేసులో లాయ‌ర్ల‌కు ఎంత ఫీజు చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేస్తామ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. లాయ‌ర్ల‌కు ఫీజు చెల్లింపులో ఉన్న శ్ర‌ద్ధ‌.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై క‌నిపించ‌డం లేద‌ని వ్యాఖ్యానించింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదుల త‌ర‌ఫు న్యాయ‌వాది క‌ల్పించుకుని ఇప్ప‌టికీ ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని కోర్టుకు తెలిపారు. పోల‌వ‌రం వ‌ల్ల 50 వేల మందికిపైగా ముంపున‌కు గుర‌య్యార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా తిరిగి క‌ల్పించుకున్న బెంచ్‌.. పోల‌వ‌రం, పురుషోత్త‌ప‌ట్నం, పులిచింత‌ల‌పై ఇచ్చిన తీర్పుపైనా విచార‌ణ చేప‌డ‌తామ‌ని తెలిపింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన న‌ష్టంపై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. అనంత‌రం ఎన్జీటీ తీర్పుల‌పై దాఖ‌లైన అన్ని పిటిష‌న్ల‌ను ఒకేసారి విచారిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే కేసు విచార‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది.

More Telugu News