రేపు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

26-09-2022 Mon 14:32
  • సెప్టెంబరు 27 నుంచి బ్రహ్మోత్సవాలు
  • సీఎం తిరుమల పర్యటన షెడ్యూలు ఖరారు
  • రేపు సాయంత్రం గన్నవరం నుంచి తిరుపతి పయనం
  • రాత్రికి తిరుమలలోనే బస
  • మరుసటి రోజు నంద్యాల జిల్లాలో పర్యటన
CM Jagan will visit Tirumala tomorrow
రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు (సెప్టెంబరు 27) మధ్యాహ్నం 3.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి బయల్దేరతారు. 

ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించనున్నారు. అనంతరం తిరుమల చేరుకుని రాత్రి 8.20 గంటలకు స్వామివారికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వెంకన్న దర్శనం అనంతరం సీఎం జగన్ రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 

మరుసటి రోజు ఉదయం మరోసారి స్వామివారి దర్శనం చేసుకుని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరుమల కొండపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 

ఆపై, రేణిగుంట చేరుకుని నంద్యాల జిల్లా పర్యటనకు వెళతారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఇటీవలే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు.