చిరంజీవి 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరం: విజయసాయిరెడ్డి

26-09-2022 Mon 14:16
  • చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్
  • మలయాళ 'లూసిఫర్' కు రీమేక్
  • మోహన్ రాజా దర్శకత్వం
  • అక్టోబరు 5న రిలీజ్
  • ఈ నెల 28న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్
Vijayasai Reddy opines in Chiranjeevi God Father movie pre release event being held in AP
మెగాస్టార్ చిరంజీవి ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించిన చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్' కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. 'గాడ్ ఫాదర్' చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబరు 28న ఏపీలోని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ మెగా వేడుకకు నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా నిలుస్తోంది. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజింపజేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం కనిపిస్తోందని విజయసాయి కొనియాడారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని పేర్కొంటూ, ట్వీట్ చేశారు.