తీవ్ర పరిణామాలు ఉంటాయ్.. రష్యాకు అమెరికా హెచ్చరిక

26-09-2022 Mon 12:27
  • విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సులివన్
  • అణు దాడి చేస్తే నిర్ణయాత్మకంగా స్పందిస్తామని ప్రకటన
  • ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా సాయం అందిస్తామని వెల్లడి
US warns Putin of catastrophic consequences over nuclear weapons
రష్యాకు అమెరికా తీవ్ర హెచ్చరిక పంపింది. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ఉపయోగిస్తే కనుక నిర్ణయాత్మకంగా అమెరికా స్పందిస్తుందని తేల్చి చెప్పింది. విపత్కర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ హెచ్చరించారు. గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా సైనిక సమీకరణకు పిలుపు నివ్వడం తెలిసిందే. రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ లోని పలు భాగాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు ఆయన నిర్ణయించారు.

ఈ క్రమంలో అమెరికా కఠినంగా స్పందించడం గమనార్హం. నిర్ణయాత్మకంగా అమెరికా స్పందిస్తుందన్న సులివన్.. దీన్ని మరింత వివరంగా చెప్పలేదు. అయితే, దీనికి సంబంధించి అసలు సందేశాన్ని రష్యాకు అమెరికా ప్రైవేటుగా చేరవేసినట్టు చెప్పారు. ఉక్రెయిన్ లోని పరిస్థితులు, పుతిన్ చర్యలు, బెదిరింపులపై అమెరికా తరచూ మాట్లాడుతూనే ఉన్నట్టు తెలిపారు. 

‘‘ఉక్రెయిన్ ప్రజలను తుడిచిపెట్టేయాలన్నది పుతిన్ ఉద్దేశ్యం. జీవించే హక్కును ఆయన విశ్వసించడం లేదు. రష్యా ఈ విషయంలో ముందుకే వెళితే మేము సైతం ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఉక్రెయిన్ కు అందించాల్సి వస్తుంది’’ అని సులివన్ చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా అణు బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలోనూ తప్పుబట్టారు.

అటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సైతం తీవ్రంగానే స్పందించారు. అణ్వాయుధాలు ప్రయోగిస్తే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అణ్వాయుధాలను ప్రయోగించిన దేశంగా, దాని తాలూకు విపత్కర పరిణామాలను రష్యా అనుభవించాల్సి ఉంటుందన్నారు.