వర్మ నాకు గురువుకంటే ఎక్కువ: కోన వెంకట్

26-09-2022 Mon 11:22
  • సినిమా రచయితగా కోన వెంకట్ కి క్రేజ్ 
  • ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో బిజీ
  • తాను రాయగలనని తనకే తెలియదన్న కోన 
  • తన టాలెంట్ ను వర్మ గుర్తించాడని వెల్లడి  
Kona venkat Interview
తెలుగు సినిమా కథా రచయితగా కోన వెంకట్ కి మంచి గుర్తింపు ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలకి ఆయన పనిచేశారు. ఒక వైపున రచయితగా ... మరో వైపున నిర్మాతగా ఆయన సినిమాలను చక్కబెడుతూనే, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు.  

"మా తాతగారు కోన ప్రభాకరరావు గారు రాజకీయనాయకులే కాకుండా గొప్ప రంగస్థల నటులు. ఆ తరువాత సినిమాల్లోను రాణించారు. ఆయన తరువాత ఇండస్ట్రీకి వచ్చింది నేనే. 'తోకలేని పిట్ట' సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా వలన తగిలిన ఆర్థికపరమైన దెబ్బల నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఇది మనం చేసే పని కాదు .. దీని జోలికి మనం వెళ్లకూడదు అని అప్పుడే నిర్ణయించుకున్నాను. 2014 వరకూ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. 

ఆ తరువాత కొన్ని బిజినెస్ లు చేసినా కలిసి రాలేదు. జీవితంలో ఎదగనివారిని ఏ బంధువూ చేరదీయడు. నా విషయంలోను అదే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నాకు రామ్ గోపాల్ వర్మ నుంచి కాల్ వచ్చింది. నాకు రాయడం తెలియదు అని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. 'నీలో ఆ టాలెంట్ ఉంది .. నువ్వు రాయగలవు' అంటూ రాయించాడు. నాలోని టాలెంటును గుర్తించి ప్రోత్సహించిన కారణంగా ఆయన నాకు గురువు కంటే ఎక్కువ. కానీ ఆ మాట అంటే మాత్రం ఆయన ఒప్పుకోడు" అంటూ చెప్పుకొచ్చారు.