తమిళనాడులో పంజాబ్ యూనివర్సిటీ తరహా ఘటన.. హాస్టల్‌లోని అమ్మాయిల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన యువతి

26-09-2022 Mon 10:05
  • మధురైలోని ఓ హాస్టల్‌లో ఉంటూ బీఈడీ చదువుతున్న నిందితురాలు
  • అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు 
  • నిందితురాలి ఫోన్‌ను రూమ్మేట్ పరిశీలించడంతో వెలుగులోకి
  • నిందితురాలితోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్
Student arrested for sending videos of hostel girls bathing and changing clothes to doctor
పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని సహచరుల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిని మర్చిపోకముందే తమిళనాడులోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన  31 ఏళ్ల కాళేశ్వరి మధురైలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన అసిక్ అనే వైద్యుడితో పరిచయం ఏర్పడింది.

అనంతరం కాళేశ్వరి తన హాస్టల్‌లోని అమ్మాయిలు స్నానం చేస్తుండగా తన మొబైల్‌తో చిత్రీకరించి వాటిని అసిక్‌కు పంపుతూ వచ్చేది. రెండు రోజుల క్రితం ఆమె రూమ్మేట్ అయిన ఓ అమ్మాయి కాళేశ్వరి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలు కనిపించాయి. వాటిని చూసి ఆమె షాకైంది. వెంటనే ఆ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లింది. వార్డెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాళేశ్వరి, అసిక్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.