Hyderabad Metro: ఉప్పల్ మ్యాచ్ ఎఫెక్ట్: నిన్న ఒక్క రోజే మూడున్నర లక్షల మంది మెట్రో ప్రయాణం!

  • ఉప్పల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20
  • అభిమానుల కోసం రాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడిపిన హైదరాబాద్ మెట్రో
  • జనసమ్మర్థంగా మారిపోయిన ఉప్పల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లు
over 3 lakh passengers journey in hyderabad metro yesterday itself

భారత్-ఆస్ట్రేలియా మధ్య గత రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు. వారి సౌకర్యార్థం నిన్న హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ట్రిప్పులు నడిపింది. రాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని ఇది వరకే ప్రకటించింది. అభిమానులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. సొంత వాహనాలపై వెళ్లి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం కంటే మెట్రో మేలని భావించడంతో ఉప్పల్‌వైపు దారితీసే మెట్రో రైళ్లన్నీ మధ్యాహ్నం నుంచే కిక్కిరిసిపోయాయి. 

మ్యాచ్ మొదలు కావడానికి రెండు మూడు గంటల నుంచే స్టేడియానికి చేరుకునేందుకు అభిమానులు పోటెత్తడంతో మెట్రో రైళ్లు దూరేందుకు సందు లేనంతగా నిండిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెట్రో స్టేషన్లు అన్నీ జనసమ్మర్థంగా మారిపోయాయి. మ్యాచ్ పూర్తయ్యాక రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉప్పల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లు జాతరను తలపించాయి. ఈ రెండు స్టేషన్ల నుంచి మాత్రమే ఆ సమయంలో ప్రయాణికులను అనుమతించారు. అయితే, దిగేందుకు మాత్రం అన్ని స్టేషన్లలోనూ అవకాశం కల్పించారు. నిన్న ఎల్‌బీ నగర్-మియాపూర్, నాగోలు-రాయదుర్గం రూట్లలో ఏకంగా మూడున్నర లక్షల మంది ప్రయాణించినట్టు సమాచారం.

More Telugu News