ఈ దుష్ట సమాజంలో ఉండొద్దని శివుడు చెప్పాడు... అందుకే చనిపోతున్నానంటూ యువకుడి ఆత్మహత్య

25-09-2022 Sun 21:43
  • ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామంలో ఘటన
  • చెన్నైలో ఉద్యోగం చేస్తున్న వెంకట పూర్ణశేఖర్ రెడ్డి
  • సొంతూరికి వచ్చి ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరి
  • సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Youth commits suicide in Prakasham district
ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వెంకట పూర్ణశేఖర్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అందుకు కారణం ప్రేమ వ్యవహారమో, మరే ఇతర సమస్య కాదు. శివుడు పిలుస్తున్నాడంటూ అతడు ఉరేసుకుని చనిపోయాడు. ఆ మేరకు అతడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వెంకట పూర్ణశేఖర్ రెడ్డి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి, చెల్లి ఉన్నారు. ఉద్యోగం చేస్తూ తల్లి, చెల్లి బాధ్యత చూసుకుంటున్నాడు. అయితే అకస్మాత్తుగా చెన్నై నుంచి సొంతూరికి వచ్చేసిన వెంకట పూర్ణశేఖర్ రెడ్డి ఇంట్లో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ దుష్ట సమాజంలో ఉండొద్దని శివుడు చెప్పాడని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన తండ్రి కూడా శివుడి దగ్గరే ఉన్నాడని, తాను కూడా ఆయన వద్దకే వెళ్లిపోతున్నానని తెలిపాడు. 

తన సోదరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, ఆస్తులన్నీ ఆమె పేరుమీద రాయాలని బంధువులకు సూచించాడు. కాగా, ఈ సూసైడ్ నోట్ లోని అతడు పేర్కొన్న అంశాలు చాట్లమడ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.