కదిలే మ్యారేజి హాలు... ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు... వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

25-09-2022 Sun 20:26
  • కంటైనర్ ను ఫంక్షన్ హాలుగా మలిచిన వైనం
  • స్టైలిష్ ఇంటీరియర్ తో ఆకట్టుకుంటున్న కంటైనర్
  • ఎక్కడికైనా తరలించే వెసులుబాటు
  • 200 మందికి ఆతిథ్యం
Anand Mahindra shares mobile marriage hall video
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో పంచుకున్నారు. ఆయన ఓ పోస్టును గానీ, వీడియోను గానీ పంచుకున్నారంటే అది ఎంతో క్రియేటివిటీతో కూడుకున్నదై ఉంటుంది. తాజాగా పంచుకున్న వీడియో ఓ కదిలే మ్యారేజి హాలుకు సంబంధించినది. 

దీని వివరాల్లోకెళితే... ఓ షిప్పింగ్ కంటైనర్ ను ఫంక్షన్ హాలుగా మలిచారు. ఈ కంటైనర్ పొడవు 40 అడుగులు కాగా, ఇందులో మడతవేసేందుకు వీలున్న కొన్ని భాగాలను తెరిస్తే మరో 30 అడుగుల వరకు విస్తరిస్తుంది. దీంట్లో 200 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు.

దీని లోపల ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులకు చల్లదనాన్ని అందించేందుకు దీంట్లో రెండు ఏసీలు కూడా అమర్చారు. నగరాల్లోని కల్యాణ వేదికలను తలపించేలా ఇది రిచ్ లుక్ తో కనిపిస్తుంది. వర్షాకాలంలోనూ దీంట్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఫంక్షన్లు జరుపుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా తరలించవచ్చు. 

ఈ మొబైల్ ఫంక్షన్ హాలు వీడియోను చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యారు. దీని రూపకర్తను కలవాలనుందని తన మనోభావాలను వెల్లడించారు. ఇది ఎంతో సృజనాత్మకంగా ఉందని కొనియాడారు.