టీమిండియా, ఇంగ్లండ్ మహిళల మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనలో ఎలాంటి తప్పులేదు: ఎంసీసీ

25-09-2022 Sun 19:48
  • ఇంగ్లండ్ పై సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మహిళలు
  • చివరి వన్డేలో మన్కడింగ్ చేసిన దీప్తి శర్మ
  • తీవ్రస్థాయిలో విమర్శలు
  • దీప్తి శర్మను సమర్థించిన ఎంసీసీ
  • నిబంధనలకు లోబడే చేసిందని స్పష్టీకరణ
MCC declares yesterday incident happened between India and England match was legal
ఇంగ్లండ్ లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానం యాజమాన్య సంస్థ... మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్. దీన్నే సంక్షిప్తంగా ఎంసీసీ అంటారు. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ లో అనుసరిస్తున్న నియమనిబంధనలను రూపొందించింది ఈ ఎంసీసీనే. ఈ సంస్థ క్రికెట్ నియమావళిని అప్పుడప్పుడు సమీక్షిస్తూ కాలానుగుణంగా మార్పులుచేర్పులు చేస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రికెట్ క్లబ్ ఇది. క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ లో ఈ క్లబ్ 1787 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

ఇక అసలు విషయానికొస్తే... నిన్న టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ ను గెలిచిన భారత మహిళలు 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బౌలర్ ఝులాన్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు. 

అయితే, ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ఇంగ్లండ్ చివరి వికెట్ ను టీమిండియా మన్కడింగ్ ద్వారా అవుట్ చేసింది. బౌలర్ బంతిని విసరకముందే నాన్ స్ట్రయికర్ ఎండర్ లో ఉన్న బ్యాటర్ క్రీజును వదిలి ముందుకు వెళితే, బౌలర్ ఆ బ్యాటర్ ను రనౌట్ చేయొచ్చు. దీన్నే మన్కడింగ్ అంటారు. భారత ఆటగాడు వినూ మన్కడ్ పేరు మీదే దీనికి మన్కడింగ్ అని నామకరణం చేశారు.

నిన్నటి మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ... ఇంగ్లండ్ టెయిలెండర్ చార్లీ డీన్ ను ఇలాగే అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మ్యాచ్ భారత్ వశమైంది. అయితే, టీమిండియా మహిళలు ఈ మ్యాచ్ లో వ్యవహరించిన తీరు క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇది నిబంధనలకు లోబడి చేసిందేనని సమర్థిస్తున్నారు. 

ఈ అంశంపై మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) స్పందించింది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ వ్యవహరించిన తీరు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. బౌలర్ చేయి నుంచి బంతి రిలీజ్ అయ్యేంతవరకు నాన్ స్ట్రయికర్ క్రీజులో ఉండాలని ఎంసీసీ పేర్కొంది. ఈ నిబంధనను పాటిస్తే నిన్న మైదానంలో చోటుచేసుకున్న ఘటనల వంటివి జరగవని అభిప్రాయపడింది. అంతేకాదు, టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్ లో చోటు చేసుకున్న రనౌట్ పూర్తిగా నిబంధనలకు లోబడి జరిగినదేనని ఎంసీసీ తేల్చిచెప్పింది. 

కాగా, దీప్తి శర్మ రనౌట్ చేసిన విధానాన్ని ఇంగ్లండ్ పురుషుల టీమ్ సభ్యులు తప్పుబడుతున్నారు. మ్యాచ్ ను ఈ విధంగా గెలవడాన్ని తాను ఇష్టపడనని సీనియర్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ తెలిపాడు. దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ తరహాలో అవుట్ చేయాలని ఆటగాళ్లు ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదని ఆండర్సన్ పేర్కొన్నాడు.