వైసీపీలో 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు: దేవినేని ఉమ

25-09-2022 Sun 17:41
  • సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని జగన్ కుప్పంలో ఏం చేస్తారు?
  • గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగింది
  • విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు
80 YSRCP MLAs ready for revolt says Devineni Uma
వైసీపీలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని... తిరుగుబాటు చేసేందుకు 80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. సొంత ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని జగన్... కుప్పంలో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగిందని చెప్పారు. రైతుల పాదయాత్ర జరుగుతుంటే... వీధిలైట్లు తీయించే స్థాయికి బూతుల మంత్రి దిగజారాడని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. 

విశాఖలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారని చెప్పారు. రిషికొండను బోడికొండగా మార్చేశారని చెప్పారు. నందివాడ మండలంలో అమరావతి రైతుల పాదయాత్ర ఈరోజు కొనసాగింది. ఈ యాత్రలో దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.