జింఖానా గ్రౌండ్ ఘటన బాధితులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • ఉప్పల్ మైదానంలో నేడు టీమిండియా వర్సెస్ ఆసీస్
  • టికెట్ల అమ్మకాల సందర్భంగా జింఖానాలో తీవ్ర తొక్కిసలాట
  • బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న  మంత్రి
  • స్టేడియానికి ముందుగానే కారులో వచ్చిన కోహ్లీ
Minister Srinivas Goud says state govt helps Gymkhana stampede victims

టీమిండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ లో తీవ్ర తొక్కిసలాట జరిగి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు గాయపడడం తెలిసిందే. వారిలో మహిళలు కూడా ఉన్నారు. చాలామంది ఆసుపత్రిపాలయ్యారు. 

దీనిపై తెలంగాణ క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. జింఖానా గ్రౌండ్ ఘటన బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాసేపట్లో బాధితులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు వెళ్లనున్నారు. వారితో కలిసి మ్యాచ్ తిలకించనున్నారు. 

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు హైదరాబాద్ లో నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. దాంతో ఈ మ్యాచ్ కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి టీమిండియా, ఆసీస్ జట్లు చేరుకోనున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్తముందుగానే కారులో స్టేడియానికి చేరుకున్నాడు. 

అటు, మ్యాచ్ కోసం ప్రేక్షకులు భారీగా ఉప్పల్ స్టేడియానికి తరలి వస్తున్నారు. పోలీసులు గేట్లు తెరిచి ప్రేక్షకులను లోపలికి పంపిస్తున్నారు. క్రికెట్ అభిమానులు స్టేడియంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

More Telugu News