అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ

25-09-2022 Sun 15:26
  • శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ
  • బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స
  • కరోనా కాదన్న వైద్యులు
Karnataka former chief minister SM Krishna hospitalized with respiratory infection
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరానన్న ప్రచారాన్ని ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఎస్ఎం కృష్ణ వయసు 90 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న ఆయనను గతరాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 

గత కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ సమస్యలతోనూ, వృద్ధాప్య సంబంధ సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఎస్ఎం కృష్ణ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ, ప్రస్తుతం ఆయనకు స్వల్ప స్థాయిలో ఆక్సిజన్, శ్వాస సంబంధ మద్దతు అందిస్తున్నామని, క్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు.

మరో మూడు నాలుగు రోజుల పాటు నిశితంగా పరిశీలించి, కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించడంపై ఆలోచిస్తామని వెల్లడించారు. పెద్ద వయసు, హృదయ సంబంధ సమస్యలు ఎస్ఎం కృష్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయని డాక్టర్ సత్యనారాయణ వివరించారు.