Jogi Ramesh: సిగ్గులేకుండా చంద్రబాబు కొడుక్కి పిల్లను ఇచ్చిన నిన్నేమనాలి ?: బాలకృష్ణపై మంత్రి జోగి రమేశ్ ఫైర్

  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ
  • కుక్కలు వెక్కిరిస్తున్నాయంటూ వ్యాఖ్యలు
  • అదేస్థాయిలో బదులిచ్చిన మంత్రి జోగి రమేశ్
  • తండ్రి కోరిక తీర్చలేని చవటలు అంటూ వ్యాఖ్యలు
Jogi Ramesh fires on Balakrishna

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరుపెట్టడంపై నందమూరి బాలకృష్ణ పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మార్చెయ్యటానికి, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అని పేర్కొన్నారు. ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారని, విశ్వాసంలేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని, శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. దీనిపై ఏపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. 

బాలకృష్ణ మూడ్రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి ఎన్టీఆర్ పేరును ఎవరూ చెరిపివేయలేరని, జాతికి ఆయననెవరూ దూరం చేయలేరని అంటున్నారని, అసలు జాతికి సమాజానికి ఎన్టీఆర్ ను ఎవరు దూరం చేశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. 

మీ తండ్రి ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కృష్ణా జిల్లాకు సీఎం జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టారని, ఆయనకు బాలకృష్ణ రుణపడి ఉండాలని తెలిపారు. బాలకృష్ణకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ అయితే, పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అని అన్నారు. గతంలో ఏం జరిగిందో బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలని జోగి రమేశ్ హితవు పలికారు. 

"సినిమాల్లో ఫైట్లు చేయడం కాదు... నువ్వు ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవాడివే అయితే, నీకు పౌరుషం ఉంటే మీ నాన్న మరణానికి కారకుడైన చంద్రబాబుపై ఫైట్ చేయి. మీ నాన్న పార్టీని, పార్టీ గుర్తును, ట్రస్టును లాగేసుకున్న చంద్రబాబుపై ఫైట్ చేయి... అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. అంతేతప్ప, ఎన్టీఆర్ చనిపోయిన 27 ఏళ్ల తర్వాత వచ్చి గుండెల్లో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, గుండీల్లో ఉన్నాడు అంటే ఎవరూ నమ్మరు. పెట్టుడు మీసాలు మెలేస్తూ చెప్పే డైలాగులు సినిమాల వరకే. 

యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది. చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాకు మీ నాన్న పేరుపెట్టి గౌరవించాం. అయినా, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెడుతున్నట్టు మీడియాలో వస్తుంటే నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? వచ్చినా ఎందుకు మాట్లాడలేదు? రక్తసంబంధాలను వదిలేసి ఎంగిలి మెతుకుల కోసం చంద్రబాబు పంచన చేరిన మీరా సీఎం జగన్ నైతికత గురించి మాట్లాడేది? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరో, ఆయనను జాతికి, సమాజానికి దూరం చేసింది ఎవరో మీకు తెలియదా?

చంద్రబాబు అనే శునకం మీ కుటుంబాన్ని బాగా వాడుకున్నాడు. ఎన్టీఆర్ ను కూలదోసినప్పుడు మీరందరూ ఎంత చక్కగా నవ్వుతున్నారు.... సిగ్గుండాలి. హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నిన్ను... ఇలా అందరినీ చంద్రబాబే వాడేసుకున్నాడు... మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని చేశాడు. 

నాడు చంద్రబాబు అనే శునకాన్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు మీరు దుర్మార్గంగా వ్యవహరించింది నిజం కాదా? చంద్రబాబు అనే శునకానికి తోక ఈ బాలకృష్ణ కాదా? మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబు కొడుక్కి సిగ్గులేకుండా పిల్లను కూడా ఇచ్చావే... నిన్ను ఏమనాలి బాలకృష్ణ శునకం?" అంటూ జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. 

అంతేకాదు, తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని సన్నాసులు, చవటలు, దద్దమ్మలు అంటూ బాలకృష్ణపై జోగి రమేశ్ విరుచుకుపడ్డారు. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పండి అంటూ 73 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ తన పిల్లలను ఆఖరి కోరిక కోరారని, తన రక్తం పంచుకుపుట్టినవాళ్లే అయితే, పౌరుషం ఉన్నవాళ్లే అయితే చంద్రబాబును నిలదీయాలని కోరారని జోగి రమేశ్ వివరించారు. 'కానీ ఆ కోరికను తీర్చలేని సన్నాసులు మీరు' అంటూ బాలకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

More Telugu News