ISRO: మైక్రో ప్రాసెసర్ తో నడిచే మోకాలును అభివృద్ధి చేసిన ఇస్రో

  • దివ్యాంగులకు ఉపకరించే కృత్రిమ మోకాలు
  • వివిధ సంస్థల సహకారంతో ఇస్రో రూపకల్పన
  • తేలిగ్గా ఉండే కృత్రిమ అవయవం
  • ధర కూడా తక్కువే!
  • త్వరలో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి
ISRO develops micro processor controlled artificial knee

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వైద్య రంగంలో ఎంతో ఉపయుక్తకరమైన ఆవిష్కరణతో అందరినీ అచ్చెరువొందించింది. ఇస్రో సరికొత్త కృత్రిమ అవయవాన్ని అభివృద్ధి చేసింది. మైక్రో ప్రాసెసర్ తో నడిచే ఓ కృత్రిమ మోకాలిని తయారుచేసింది. దీన్ని మైక్రో ప్రాసెసర్ నియంత్రిత మోకాలు (ఎంపీకే) అని పిలుస్తారు. 

ఇది అత్యంత తేలికగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.6 కేజీలు. ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, మార్కెట్లో లభించే కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ ఎలక్ట్రానిక్ మోకాలు ధర చాలా చౌక అని అంటున్నారు. 

భారత్ లో ప్రస్తుతం లభించే కృత్రిమ మోకాలు ధర రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుంది. ఇవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అయితే ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ఎంపీకే వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి అయితే, ఇవి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపే లభించవచ్చని తెలుస్తోంది. 

ఈ ఎంపీకే సాయంతో ఎంతో సులువుగా నడవొచ్చని, దివ్యాంగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. కాగా, ఈ ఎంపీకే తయారీలో ఇస్రోకి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటార్ డిజెబిలిటీస్ (ఎన్ఐఎల్డీ), దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్, ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు సహకారం అందించాయి. 

ఈ కృత్రిమ మోకాలులో మైక్రో ప్రాసెసర్, హైడ్రాలిక్ డాంపర్, లోడ్ అండ్ నీ యాంగిల్ సెన్సర్లు, కాంపోజిట్ నీ కేస్, లిథియం అయాన్ బ్యాటరీ తదితర పరికరాలు ఉంటాయి.

More Telugu News