Pulkit Arya: యువతి హత్యకేసు.. ఉత్తరాఖండ్ బీజేపీ నేత తనయుడి అరెస్ట్

  • ఈ నెల 18న అదృశ్యమైన యువతి
  • మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చిన పోలీసులు
  • ప్రధాన నిందితుడు ఉత్తరాఖండ్ మాజీ మంత్రి తనయుడు
  • అసాంఘిక కార్యకలాపాలు బయటపెడతానని బెదిరించిన యువతి
  • కోపంతో కెనాల్‌లోకి తోసేసిన నిందితులు
BJP leaders son arrested over murder of Uttarakhand girl who worked at his resort

యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఉత్తరాఖండ్ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రిషికేష్‌ లక్ష్మణ్ ఝులా ప్రాంతంలోని పుల్కిత్ రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి హత్యకు గురైంది. ఈ నెల 18న యువతి అదృశ్యమైంది. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి రిషికేష్ వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

తిరిగి వస్తుండగా చిలా రోడ్డులోని కెనాల్ వద్ద మద్యం తాగేందుకు ఆగారు. వారు మద్యం తాగుతుంటే యువతి వారి కోసం వేచి చూసింది. ఆ తర్వాత యువతికి, వారికి మధ్య గొడవ మొదలైంది. రిసార్టులో వీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని బయటపెడతానని ఆమె బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు ఆమెను కెనాల్‌లోకి తోసేశారు. 

మిస్సింగ్ కేసును శుక్రవారం పోలీసులు హత్య కేసుగా మార్చారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్ పోలీసులు ప్రధాన నిందితుడైన పుల్కిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా, మేనేజర్ సౌరభ్ భాస్కర్‌లను అరెస్ట్ చేశారు. నిన్న వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. 

బాధిత యువతి తండ్రి ఆరోపణలు ఇవీ..
తన కుమార్తెను నిందితులు వేధించారని, దానిని రికార్డు చేశారని బాధిత యువతి తండ్రి ఆరోపించారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత 21న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిసార్ట్ యజమాని అయిన నిందితుడు పుల్కిత్ ఆర్య రాష్ట్ర మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు. పుల్కిత్ పై గతంలోనూ పలు వివాదాలు ఉన్నాయి.

More Telugu News