టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులపై మల్లు భట్టి విక్రమార్క స్పందన ఇదే

23-09-2022 Fri 16:25
  • నేషనల్ హెరాల్డ్ కేసులో టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులు
  • ఈడీ పేరిట బీజేపీ విపక్షాలను వేధిస్తోందన్న భట్టి విక్రమార్క
  • ఈ తరహా కేసులకు కాంగ్రెస్ భయపడదన్న టీ సీఎల్పీ నేత
tclp leader mallu bhatti vikramarka responds on ed notices to tpcc leaders
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేతలకు ఎన్ ఫోర్ప్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ టీపీసీసీ నేతలకు ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నోటీసులపై టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాజాగా స్పందిస్తూ.. దేశంలోని అన్ని ప్రతిపక్షాలకు ఈడీ పేరిట వేధింపులు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కుట్రతోనే కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ తరహా వేధింపులు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిత్యకృత్యమయ్యాయన్నారు. అయితే ఈ తరహా కేసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడిపోరని భట్టి విక్రమార్క అన్నారు.