మదీనాలో అపారమైన బంగారం, రాగి నిక్షేపాలు కనుగొన్నాం: సౌదీ అరేబియా ప్రకటన

23-09-2022 Fri 16:10
  • సౌదీ గడ్డపై నూతన ఆవిష్కరణలు
  • అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు
  • అల్ మదీక్ ప్రాంతంలో నాలుగు చోట్ల రాగి ఖనిజం
  • భారీ పెట్టుబడులు వస్తాయని భావిస్తున్న సౌదీ
Huge gold and copper deposits at Medina in Saudi Arabia
చమురు నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచిన సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. 

మదీనా ప్రాంతంలోని అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్ మదీక్ ప్రాంతంలో నాలుగు చోట్ల రాగి ఖనిజం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. 

తాజా ఆవిష్కరణల ద్వారా భవిష్యత్ పెట్టుబడుల దిశగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నామని సౌదీ జియోలాజికల్ సర్వే పేర్కొంది. కాగా, ఈ నూతన నిక్షేపాల ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని, 4 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని స్థానిక మీడియా పేర్కొంది. 

సౌదీ అబిరేయాలో 5,300 ప్రాంతాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబాన్ గతంలో తెలిపారు.