Amit Shah: నితీశ్ కుమార్ బీజేపీకి నమ్మకద్రోహం చేశారు: అమిత్ షా

  • ప్రధాని కావాలనే ఆశతో నమ్మకద్రోహం చేశారన్న అమిత్ షా 
  • బీహార్ లో బీజేపీ సాధించిన సీట్లలో నితీశ్ పార్టీ సగమే సాధించిందని వ్యాఖ్య 
  • అయినా నితీశ్ ను మోదీ సీఎం చేశారన్న కేంద్ర మంత్రి 
Nitish Kumar Betrayed BJP says Amit Shah In Bihar

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రధాని కావాలనే ఆశతో ఆయన బీజేపీకి నమ్మక ద్రోహం చేశారని అన్నారు. బీహార్ లోని పూర్ణియాలో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత... బీజేపీ నిర్వహించిన తొలి సభ ఇదే కావడం గమనార్హం. 

అమిత్ షా ప్రస్తుతం రెండు రోజుల పర్యటనకు గాను బీహార్ లో ఉన్నారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లలో కేవలం సగం మాత్రమే నితీశ్ కుమార్ పార్టీ సాధించిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ నితీశ్ కు సీఎం అయ్యే అవకాశాన్ని ప్రధాని మోదీ కల్పించారని అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారని... చెప్పిన విధంగానే తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ ను సీఎం చేశారని అన్నారు. అయినప్పటికీ నితీశ్ కుమార్ నమ్మకద్రోహం చేసి, వెళ్లిపోయారని విమర్శించారు. ప్రధాని కావాలనే కోరికతో కాంగ్రెస్, లాలూ ప్రసాద్ తో చేతులు కలిపారని దుయ్యబట్టారు.

More Telugu News