గాడ్ ఫాదర్ ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పిన చిరంజీవి

23-09-2022 Fri 15:00
  • చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్
  • మోహన్ రాజా దర్శకత్వంలో చిత్రం
  • అక్టోబరు 5న రిలీజ్
  • ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం
  • చార్టర్డ్ ప్లేన్ లో చిరంజీవి ఇంటర్వ్యూ
Chiranjeevi explains God Father movie in a single word
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా చిరంజీవి ప్రముఖ యాంకర్ శ్రీముఖికి ఓ చార్టర్డ్ ప్లేన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. 

గాడ్ ఫాదర్ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పారు. సరిగ్గా చెప్పాలంటే గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని అభివర్ణించారు. హీరోయిన్లు లేరేంటి, పాటలు లేవేంటి? అనే ఆలోచనే రానివ్వని సబ్జెక్ట్ గాడ్ ఫాదర్ అని పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని, హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్... వుయ్ లవ్యూ అని కొనియాడారు. 

ఇందులో జర్నలిస్టు పాత్ర చేసేందుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ మొదట అంగీకరించలేదని చిరంజీవి వెల్లడించారు. ఈ సినిమా చూసి తర్వాత పూరీలో సాధికారత ఉన్న నటుడు ఉన్నాడని మీరే ఆశ్చర్యపోతారు అని తెలిపారు. 

ఈ సినిమాకు ఆరో ప్రాణమై, 100 శాతం కంటే ఇంకా ఎక్కువకు తీసుకెళ్లిన వ్యక్తి సంగీత దర్శకుడు తమన్ అని కితాబునిచ్చారు. ఈ మేరకు చిరంజీవి ఇంటర్వ్యూ ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ పంచుకుంది.