జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన... మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు

23-09-2022 Fri 14:44
  • వంశీ కృష్ణ సహా పలువురు జర్నలిస్టుల అరెస్ట్
  • జర్నలిస్టులపై అక్రమ అరెస్ట్ లపై పోరాడాలన్న వంశీ కృష్ణ
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు
ap cid arrests maha news md vamsi krishna
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ పోస్ట్ ను ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ తీరును నిరసిస్తూ గుంటూరులోని సీఐడీ కార్యాలయం ముందు శుక్రవారం పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సీఐడీ పోలీసులతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు... బంగారం స్మగ్లర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 


ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణ సహా పలువురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు ముందు మీడియాతో మాట్లాడిన వంశీ కృష్ణ.. జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.