ఫిట్ నెస్ ట్రైనర్ ను పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్ కూతురు

23-09-2022 Fri 14:17
  • ఆమిర్ వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తున్న నుపుర్ శిఖారే
  • ఇదే సమయంలో ఐరా ఖాన్ తో పరిచయం
  • 2020 నుంచే ప్రేమలో ఉన్న జంట
Aamir Khan daughter to marry fitness trainer
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రేమను అధికారికంగా బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఆమిర్ ఖాన్ కు నుపుర్ శిఖారే పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నాడు. గత కొన్నేళ్ల నుంచి ఆమిర్ వద్ద పని చేస్తున్నాడు. 

ఈ క్రమంలో ఆయన వద్ద నుంచి ఐరా కూడా ఫిట్ నెస్ పాఠాలను నేర్చుకుంది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం మొదలై... ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు 2020 నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని వారు అధికారికంగా వెల్లడించలేదు. 

తాజాగా, సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ విదేశాలకు వెళ్లాడు. ఆయనతో పాటు ఐరా కూడా వెళ్లింది. పోటీలు ముగిసిన తర్వాత ఆయన ఐరా వద్దకు చేరుకుని, మోకాలిపై కూర్చొని... నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె ఎస్ చెప్పింది. ఆ తర్వాత ఐరాకు ఉంగరాన్ని తొడిగి, ముద్దు పెట్టాడు. తాను ఎస్ చెప్పాను అని సోషల్ మీడియా వేదికగా ఐరా కూడా వెల్లడించింది.