నేడే ఆసిస్ తో టీమిండియా రెండో టీ20... గెలిస్తేనే సిరీస్ పై ఆశలు

23-09-2022 Fri 13:26
  • ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న భారత్
  • తొలి మ్యాచ్ లో ఆసిస్ చేతిలో ఓడిన టీమిండియా
  • నేడు నాగ్ పూర్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్
  • దినేశ్, భువనేశ్వర్ లను మార్చే దిశగా యోచిస్తున్న రోహిత్, ద్రావిడ్
team india will play second t20 with australia in nagpur today
అన్ని ఫార్మాట్లలో పటిష్ఠంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో కొనసాగుతున్న టీ20 సిరీస్ లో భారత జట్టు వెనుకబడింది. భారత్ లోనే జరుగుతున్న 3 మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే ఓ మ్యాచ్ ముగియగా... నేడు (శుక్రవారం) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. నాగ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే... సిరీస్ పై టీమిండియాకు ఆశలు ఉంటాయి. నేటి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా గెలిస్తే... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఆసిస్ కైవసం అవుతుంది. 

ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ దృష్టి సారించారు. తొలి మ్యాచ్ లో వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ పెద్దగా రాణించలేకపోయిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్న రోహిత్, ద్రావిడ్... అతడి స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకుంటే ఎలా ఉంటుందన్న దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో రాణించని భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఫిట్ నెస్ సాధించి జట్టుతో చేరిన జస్ ప్రీత్ బుమ్రాను తీసుకోవడంపైనా చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ రెండు మార్పులు మినహా తొలి మ్యాచ్ ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.