కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీలెవరూ ఉండరు: అశోక్ గెహ్లాట్

23-09-2022 Fri 13:07
  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
  • రేసులో అందరి కంటే ముందు వరుసలో గెహ్లాట్
  • ఈ దఫా గాంధీయేతరులే అధ్యక్షులు అవుతారన్ని రాహుల్
  • తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని వెల్లడి
  • రాహుల్ గాంధీ తనతో ఈ విషయాలు చెప్పారన్న గెహ్లాట్
Ashok Gehlot states that no one from gandhi family will contest congress presidential polls
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రేసులో అందరికంటే ముందు ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ పోటీలో ఉండబోరని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధే తనతో చెప్పారని గెహ్లాట్ తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో మొన్న సోనియా గాంధీతో భేటీ అయిన గెహ్లాట్... ఆ మరునాడే కేరళ వెళ్లి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీరే చేపట్టాలంటూ ఆయన రాహుల్ గాంధీకి సూచించారు. యావత్తు కాంగ్రెస్ శ్రేణుల ఆకాంక్ష కూడా ఇదేనంటూ ఆయన రాహుల్ కు వివరించారు.

గెహ్లాట్ ప్రతిపాదనకు స్పందించిన రాహుల్ గాంధీ... ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తమ కుటుంబానికి చెందిన వారెవ్వరూ ఉండబోరని చెప్పినట్లుగా గెహ్లాట్ తెలిపారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత ఎంపికవుతారని రాహుల్ తెలిపినట్లుగా ఆయన వెల్లడించారు. ఈ దిశగా తాను ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని రాహుల్ తనతో చెప్పారని గెహ్లాట్ వివరించారు.